Syed Abid Ali: హైదరాబాదీ గ్రేటెస్ట్ ఆల్‌రౌండ‌ర్‌.. అబిద్ అలీకు శాశ్వత వీడ్కోలు.. 11 month ago

featured-image

భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన హైదరాబాదీ గొప్ప ఆల్‌రౌండర్ శ్రీ సయ్యద్ అబిద్ అలీ ఇక మన మధ్య లేరు. ఆయన అనారోగ్య కారణంచేత మార్చి 12న బుధవారం అమెరికాలో 83 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారత క్రికెట్ ప్రపంచానికి తీరని లోటును మిగిల్చింది. 1960-70 దశకాల్లో భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివి. చిరుత పులి లాంటి వేగంతో.. బాల్ ని వెంటాడి మరీ ఫీల్డింగ్ చేసేవాడు.. అందుకే అప్పట్లోనే గ్రేటెస్ట్ ఫీల్డర్‌గా సయ్యద్ అబిద్ అలీ పేరు మార్మోగిపోయింది. 


ఆల్‌రౌండర్‌గా రాణించిన ఆయన.. 1971లో భారత్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. చారిత్రాత్మక ఓవల్ టెస్టులో సభ్యుడిగా నిలిచి, భారత విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 13 సెంచరీలు.. 397 వికెట్లు సాధించారు. టెస్టుల్లో 47 వికెట్లు.. 1018 పరుగులు చేశారు. ఫీల్డింగ్‌లో మెరుపు తీగలా కదిలేవారు, అందుకే 'గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్'గా పేరుగాంచారు. 

1941 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ, సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ మరియు ఆల్ సెయింట్స్ స్కూల్ తరపున క్రికెట్ ఆడాడు. కేరళతో జరిగిన ఒక మ్యాచ్‌లో 82 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో అతను బెస్ట్ ఫీల్డర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. చదువు పూర్తయ్యాక.. అబిద్ అలీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి, అదేవిధంగా హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు.

చిన్నతనంలో హైదరాబాద్ క్రికెట్ సర్కిల్స్‌లో ఆయనను 'చిచ్చా' అని పిలిచేవారు. ఫతేమైదాన్ (ఎల్బీ స్టేడియం)లో గంటల తరబడి ఫీల్డింగ్, బౌలింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు. పిచ్ రోలర్ మీద నీళ్లు చల్లి.. బంతిని వేగంగా దానికి కొట్టి.. ఆ బాల్ ఎటు వెళ్తే అటు వేగంగా పరిగెత్తి.. ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఆయన 2012 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 29.30 సగటుతో 8,732 పరుగులు చేశారు. ఇందులో 13 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక 28.55 సగటుతో 397 వికెట్లు కూడా తీశాడు. అప్పడప్పుడు వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన సయ్యద్ అబిద్ అలీ మొత్తంగా 190 క్యాచ్‌లు పట్టి 5 స్టంపింగ్స్ కూడా చేసాడు. 

భారత్ తరుపున సయ్యద్ అబిద్ అలీ 29 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో బౌలింగ్ పరంగా 42.12 సగటుతో 47 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా వచ్చిన అలీ 20.36 సగటుతో 1018 పరుగులు చేశాడు. 1971లో ఇంగ్లండ్ మరియు వెస్టిండీస్‌లతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ సాధించిన చారిత్రక విజయాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా.. వెస్టిండీస్‌తో జరిగిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్ట్ మ్యాచ్‌లో ఆయన వేసిన చివరి ఓవర్ భారత విజయంలో కీలకంగా మారింది. ఆ ఓవర్‌లో రెండు వికెట్లు తీసి.. ఆయన మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు. 


క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత.. ఆయన యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించారు. హైదరాబాద్ జూనియర్ జట్లకు శిక్షణ ఇచ్చారు. 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ కూడా ఆయన క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. 

అబిద్ అలీకి BCCI సంతాపం తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మరియు ఇతర ప్రతినిధులు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అబిద్ అలీ గారు భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రముఖ పాత్రధారి.. ఆయ‌న ఆట‌ గ‌ర్వించ‌ద‌గిన‌ది. ఆయన మరణం భారత క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆటతీరు యువ క్రికెటర్లకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుంది.

ఆయన కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము. 

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD